సైనికుడా వందనం
గోదావరి జిల్లాలో గోవిందాపురం లో రామారావు గారంటే తెలియని వాళ్ళు లేరు ..ఇంకా చెప్పాలంటే గోవింధాపురంలోనే కాదు మొత్తం గోదావరి జిల్లాలోనే ఆయన పేరు తెలియని వారు లేరు ..ఉపాధ్యాయుడిగా గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఊర్లలో కూడా ఎంతో మంది విద్యార్థులను భావి పౌరులుగా తీర్చి దిద్దటంలో ఆయన చేసిన కృషి వల్ల అక్కడి ప్రజలకు ఆయనంటే గౌరవం ..ఆ రోజు ఆయన రిటైర్మెంట్ రోజు ..స్కూల్ నుంచి ఆయన్ని ఇంటిదాకా సాగనంపడానికి ఊరు ,ఊరంతా కదిలి వచ్చింది ..రామారావు మాస్టారు గారు రిటైర్ అయ్యి వెళ్లిపోతున్నారు అన్న విషయం తెలిసినప్పటి నుంచి బడిలో పిల్లలు కన్నీరు మున్నీరు గా ఏడుస్తూనే వున్నారు ..రామారావు మాస్టారికి కూడా మనసులో ఒక పక్క ఆనందం ..మరో పక్క తెలియని బాధ రెండు ఒకేసారి కలిగాయి ..తన చేతుల మీదుగా ఎంతో మంది పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయటమే కాకుండా వారంతా జీవితంలో మంచి స్థానాల్లో స్థిరపడటంతో ఆనందం ఒక వైపు ..ఇన్నేళ్ల ఈ ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఇంటికి చేరుకుంటున్నందుకు దుఃఖం ఒకేసారి వచ్చాయి ఆయనకు
రామారావు గారికి ఒక అమ్మాయి ,ముగ్గురు కొడుకులు ..అమ్మాయికి గోదావరి జిల్లాలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసాడు ..ఇక ముగ్గురు కొడుకులకు కూడా దేశ భక్తి కలిసి వచ్చేలా దేశం కోసం స్వతంత్ర పోరాటం చేసిన పోరాట యోధుల పేర్లు పెట్టుకున్నారు ..పెద్దవాడికి సుభాష్ చంద్ర బోస్ అని ,రెండో వాడికి చంద్ర శేఖర్ ఆజాద్ అని మూడో వాడికి భరత్ అనే పేర్లు పెట్టుకున్నాడు ..పెద్ద వాడు సుభాష్ సివిల్స్ పరీక్ష పాస్ అయ్యి ఢిల్లీ లో ఐపీఎస్ ఆఫీసర్ కాగా ,రెండో వాడు చంద్ర శేఖర్ కూడా సివిల్స్ లో సెలెక్ట్ అయ్యి ఐఏఎస్ అధికారిగా ఢిల్లీ లోనే కొలువు సంపాదించుకున్నాడు ..అయితే రామారావు మాస్టారు గారి బాధంతా చిన్న వాడు భరత్ గురించే ..భరత్ చదువులో అన్నయ్యలతో పోటీ పడలేకపోగా వెనకపడిపోయాడు ..ఎలాగోలా డిగ్రీ అయితే చేతికి తెచ్చుకోగలిగాడు కానీ సరైన స్థానంలో స్థిరపడలేకపోయాడు భరత్ ..ఇప్పుడు రామారావు మాస్టారు గారి ఆలోచనంతా భరత్ గురించే ..ఇప్పుడు తాను కూడా రిటైర్ అయ్యాడు కాబట్టి ఈ రోజు భరత్ తో విషయం మాట్లాడి ఎలాగైనా వాడిని కూడా ఒక దారిలో పెట్టాలి అనుకుంటూ ఇంటికి చేరారు రామారావు గారు ..ఆఫీసు పనుల వల్ల తండ్రి రిటైర్మెంట్ కార్యక్రమానికి రాలేకపోతున్నామని ఇద్దరు కొడుకులు ముందే చెప్పారు ..కూతురు ,అల్లుడు మాత్రం వచ్చారు ..భరత్ కూడా గ్రామంలోనే ఉండటంతో స్కూల్ వరకు వచ్చి తండ్రి రిటైర్మెంట్ కార్యక్రమం అయ్యేదాకా ఉండి ఎదో పనుందంటూ అక్కకు , బావకు చెప్పి వెళ్ళిపోయాడు
సరే ఆలా ఆలోచిస్తూనే రామారావు మాస్టారు గారు ఇంటికి చేరుకున్నారు ..భార్య జానకమ్మ వాకిట్లోనే ఆయనకు ఎదురొచ్చి దిష్టి తీసి ఆయన్ని ఇంటిలోకి తీసుకెళ్లింది ..కానీ ఎందుకో ఆయన ముభావంగా ఉండటం గమనించి “ఎందుకలా వున్నారు ” భయంగా అంటూ ఆయన్నే అడిగేసింది .. రామారావు గారంటే బడి పిల్లలకే కాదు ఇంట్లో వాళ్ళకి ,ఊళ్లో వాళ్ళకి కూడా భయము ,గౌరవం
ఏదో ఆలోచిస్తున్న రామారావు గారు జానకమ్మ ప్రశ్నతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చారు ..”అదే ..మన భరత్ గురించి ఆలోచిస్తున్నా “..చెప్పారు
అక్కడే ఉన్న కూతురు కల్పించుకుని ” నాన్న గారూ..మీరేమనుకోనంటే ఒక మాట చెపుతాను ..మీరు ,అమ్మ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ..ఇటువంటి సమయంలో తమ్ముడు మీకు తోడుగా మీ దగ్గరే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం “..అంటూ ఇంకా ఏదో చెప్పబోయేలోపు అల్లుడు కల్పించుకుని “అవును మామగారు ..మీ అమ్మాయి చెప్పింది నిజం ..కావాలంటే భరత్ ఇక్కడే ఉండి నాతో పాటు మా పొలాలు చూసుకుంటూ ఉంటాడు “..అని చెప్పటంతో
రామారావు గారు కూతురి వంక చూసి ” లేదమ్మా ..నా చేతుల్తో ఎంతో మంది పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దాను ..వాడి కన్నా పెద్దవాళ్ళైనా అన్నయ్యలు కూడా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ..కానీ ఎందుకో భరత్ ను ప్రయోజకుడిని చేయలేకపోయానే అన్న భాధ నన్ను వెంటాడుతుంది ..ఇక ,నాకు అమ్మకు అంటావా ?భగవంతుడి దయ వలన ప్రస్తుతం ఏ లోటు లేదు ..నాకు వచ్చే పెన్షన్ తో హాయిగా బతికేస్తాం ..అందుకే అన్నయ్యలు ఇద్దరు రమ్మన్నా రానని చెప్పేశా ..దూరంగా ఉంటేనే విలువలు ,ఆపేక్షలు ఉంటాయమ్మా ..ఊళ్లో వాళ్ళందరూ మీ చిన్నబ్బాయి ఏమి చేస్తాడు ?అంటే సమాధానం చెప్పలేకపోతున్నానమ్మా ..వాడి గురించే నా ఆలోచన అంతా..” భారంగా అన్నారు
అప్పుడే గుమ్మం లో అడుగుపెట్టిన భరత్ ఈ సంబాషణ అంతా విన్నాడు ..అయినా ఏమి విననట్లే లోపలికి వచ్చాడు
లోపలి రావటంతోనే “భరత్ ..అన్న రామారావు గారి పిలుపుతో ఆగి ఏంటి నాన్నగారూ..అన్నట్లు చూసాడు
“భరత్..నీతో మాట్లాడాలి ..ఇలా దగ్గరికి రా “..తండ్రి పిలుపుతో మౌనంగా ఆయన దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకుని నిలబడ్డాడు భరత్
“చూడు భరత్ ..నా చేతుల్తో ఎంతో మంది పిల్లలను చదివించి ప్రయోజకుల్ని చేశాను ..మీ అన్నయ్యలు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ..అందుకే నీ గురుంచి కూడా మీ పెద్దన్నయ్య సుభాష్ తో మాట్లాడాను ..అక్కడే ఢిల్లీ లో నీకు ఏదన్నా చిన్న కొలువు చూడమని..అందుకని నువ్వు బయలుదేరి ఢిల్లీ వెళితే అన్నయ్య నీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తా అన్నాడు ..ఏమంటావు ?ప్రశ్నర్ధకంగా అడిగారు రామారావు గారు
భరత్ ది కొద్దిగా దుందుడుకు స్వభావం ..తండ్రి మాటలకూ ఎటువంటి సమాధానం చెపుతాడో అని తల్లి ,కూతురు భయపడ్డారు
కానీ భరత్ మాత్రం ప్రశాంతంగా “నాన్న గారూ ..మీరే కదా ఎప్పుడూ అంటుంటారు ..దేశం మనకేమిచ్చింది అని ఆలోచించేకన్నా ,దేశానికీ మనమేం ఇచ్చాం అని ఆలోచించాలి అని చెపుతారు కదా ..నేను కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను ..నాకు కొద్దిగా సమయం ఇవ్వండి ..నేను ఏ పని చేసిన మీరు గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తాను ..పొరపాటున కూడా మిమ్మల్ని తలదించుకునేలా చెయ్యను ..ఇక నా భవిష్యత్ గురించి అన్నయ్యలను ఇబ్బంది పెట్టటం నాకు ఇష్టం లేదు ..నా మనసుకు నచ్చిన పనే నేను చెయ్యగలను నాన్నగారు ..నేను ఈ రాత్రికే బయలుదేరి వెళ్తున్నా నాన్న గారు ..వెళ్లే ముందు నన్ను ఎక్కడికి అని అడగకండి ..ఎటువంటి ఆటంకాలు రాకుండా నన్ను దీవించి పంపండి ..త్వరలో మీరు గర్వంగా తల ఎత్తుకునేలా మంచి కొలువు సంపాదించుకుని మీ దగ్గరికి వస్తా “..అని చెప్పటంతో రామారావు గారితో పాటు అక్కడే ఉన్న జానకమ్మ ,అల్లుడు ,కూతురు కళ్ళలో కూడా కన్నీళ్లు తిరిగాయి ..నిన్నటి దాక పొలం గట్లంబడి ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరగా తిరిగిన భరత్ లో ఇంత మెచూరిటీ ఎప్పుడు వచ్చింది ?జీవితంపై ఇంత క్లారిటీ ఎప్పుడు వచ్చింది ?మాటల్లో ఎక్కడ గందరగోళం లేదు ..చాల ప్రశాంతంగా స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా వున్నాయి భరత్ మాటలు ..రామారావు గారికే ఆశర్యం వేసింది
అయినా ఉబికి వస్తున్నా కన్నీటిని ఆపుకుంటూ “చూడు భరత్ ..నీ ఉద్యోగ ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ..అయితే నీ ప్రయత్నంలో ఏదైనా అవాంతరం వస్తే మారు ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేయ్ ..నీకు మేము ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు “..చెప్పారు రామారావు గారు
భరత్ కళ్ళ వెంబడి ఉబికి వస్తున్న కన్నీటిని ఎవరి కంట పడకుండా చూసుకుంటూ తల్లి తండ్రుల పాదాలకు నమస్కరించి అక్కడే ఉన్న అక్కా ,బావాలకు చెప్పి భుజాన బ్యాగ్ వేసుకుని బతుకు సమరానికి బయలుదేరాడు ఆ రాత్రికి పల్లె వదిలి పట్నానికి
రెండు రోజుల తర్వాత భరత్ నుంచి ఫోన్ వచ్చింది ..తనకు మంచి ఉద్యోగం వచ్చిందని .. ఉద్యోగ వివరాలు త్వరలో చెప్తానని ..అయితే ఉద్యోగంలో భాగంగా రిమోట్ ఏరియా అయిన మారుమూల ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఇంటర్నెట్ ,ఫోను సౌకర్యాలు వుండవు కాబట్టి వీలు చూసుకుని తానె ఫోన్ చేస్తాను ..అమ్మ ఆరోగ్యం జాగ్రత్త ..అంటూ రామారావు గారికి చెప్పటంతో సంతోషంతో ఆయనకు ఆనంద భాష్పలు రాలాయి
“సరే నాన్నా..ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో ..వీలు వెంబడి ఫోను చేస్తుండు ..అని కొడుక్కి జాగ్రత్తలు చెప్పిన రామారావు గారు మొట్టమొదటి సారిగా ఆలోచనలో పడ్డారు .. భరత్ విషయంలో తప్పు చేసానా ?అన్న ఫీలింగ్ వచ్చింది ..కూతురు చెప్పినట్లుగా భరత్ ను ఇక్కడే తమ దగ్గర ఉంచుకుని ఉంటే బాగుండేదేమో ?అనవసరంగా వాడ్ని ఉద్యోగం పేరుతొ దూరాలకు పంపించాను కదా ?ఇలా ఆలోచిస్తూ తెల్లవార్లూ కలత నిద్దుర పోయారు
మెల్లగా కాలం దొర్లిపోతుంది..భరత్ నుంచి ఎప్పుడో కానీ ఫోన్లు రావటం లేదు ..ఆ ఫోను చేసినప్పుడు కూడా చాల హడావుడిగా ఫోన్ మాట్లాడి అవతల నాకు అర్జెంట్ పనులు ఉన్నాయంటూ పెట్టేసేవాడు ..సరే వాడు చేసే ఉద్యోగం అటువంటిది కదా అని సరిపెట్టుకున్నారు రామారావు గారు
కొంతకాలానికి రామారావు గారింట్లో ఫోన్ మోగింది ..”హలో ఎవరూ ..”అడిగారు రామారావు గారు
“హలో ..నమస్కారమండి..రామారావు గారేనా మాట్లాడేది “..అటువైపునుంచి
“అవునండి ..నేను రామారావునే మాట్లాడుతున్నా ..మీరూ? అంటూ ప్రశ్నర్ధకంగా అడిగారు
“నమస్కారం రామారావు గారూ ..నా పేరు శర్మ ..నేను రాష్ట్రపతి భవన్ నుంచి మాట్లాడుతున్నాను ..భరత్ గారు మీ అబ్బాయే కదా ?..”
తన కొడుకును రాష్ట్రపతి భవన్ నుంచి అధికారి ఫోన్ చేసి గారు అని సంబోదించటంతో ఆశర్యపోయిన రామారావు గారు “అవునండీ భరత్ మా అబ్బాయే ..ఇంతకీ విషయమేంటో చెప్పగలరా ?మా అబ్బాయి వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా ?భయపడుతూ అడిగారు రామారావు గారు
“అయ్యో ..అటువంటిది ఏమీ లేదండి ..రాష్ట్రపతిగారు మిమ్మల్ని సకల లాంచనాలతో రాష్ట్రపతి భవన్ కు తీసుకురమ్మన్నారు ..మరి కాసేపట్లో అక్కడి జిల్లా కలెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఢిల్లీ వచ్చే విమానంలో ఎక్కిస్తారు ..ఇక్కడికి రాగానే మా అధికారులు మిమ్మల్ని రిసీవ్ చేసుకుని రాష్ట్రపతి భవన్ కు తీసుకు వస్తారు ..” రాష్ట్రపతి భవన్ నుంచి ప్రత్యేక అధికారి ఫోనులో చెపుతున్నారు
రామారావు గారికి అంతా అయోమయంగా వుంది ..”అసలేం జరిగిందండి ..మేము రాష్ట్రపతి భవన్ కు రావటం ఏమిటి ?అసలు మీరు ఫోన్ చేసింది నాకేనా ?లేకపోతె ఎవరో అనుకుని పొరబడి నాకు చేసారా ?
“రామారావు గారు ..మీకు అన్ని విషయాలు స్వయంగా రాష్ట్రపతి గారే చెపుతారు..మరి కాసేపట్లో అక్కడి కలెక్టర్ గారు మీ దగ్గరికి వస్తారు ..ఈ లోపు మీరు రెడీ అవ్వండి ..ఉంటాను సార్.. నమస్కారం సార్ ..అంటూ ఫోన్ పెట్టేసారు
ఆయన ఆలా ఫోన్ పెట్టాడో లేదో ఇంటిముందు కార్లు ఆగిన శబ్దం వినిపించింది ..బిళ్ళ బంట్రోతు హడావుడిగా ముందు వస్తే వెనుకే వచ్చిన కలెక్టర్ “నమస్కారం రామారావు గారూ ..మీ ఢిల్లీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి “అని ఇంకా ఎదో చెప్పబోతుండగా రామారావు గారు అడిగారు కలెక్టర్ ని “కలెక్టర్ గారూ ..మీరైనా చెపుతారా ?ఈ ఢిల్లీ ప్రయాణం ఏంటో ?
“సర్ ..నిజానికి నాకు కూడా పూర్తి వివరాలు తెలీవు ..రాష్ట్రపతి భవన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది .మిమ్మల్ని ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్ కు పంపించమని”.. బయలుదేరండి సర్ ..అని కలెక్టర్ అనటంతో చేసేదేమి లేక బయలుదేరారు రామారావు గారు ..బయలుదేరేముందు ఢిల్లీ లో ఉన్న కొడుకులకు విషయం చెప్పి ఢిల్లీ బయలుదేరి వస్తున్నామని చెప్పారు ..ఆశర్యంగా వాళ్ళు కూడా రాష్ట్రపతి భవన్ నుంచి తమకు కూడా ఫోన్ వచ్చిందని ..ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్ కు తీసుకు రమ్మన్నారని చెప్పటంతో ఈ సారి ఆశర్యపోవటం రామారావు గారి వంతు అయింది ..భరత్ కు ఫోన్ చేస్తుంటే ఎంతసేపటికి కలవక పోవటంతో అయిష్టంగానే వారితో ఢిల్లీ బయలుదేరారు రామారావు దంపతులు వెంట కూతురు ,అల్లుడిని తీసుకుని
ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో విమానం దిగగానే అక్కడ ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులుగా పనిచేస్తున్న ఇద్దరు కొడుకులు మరికొందరు సైనిక అధికారులతో సిద్ధంగా వున్నారు ..రామారావు దంపతులను చూడగానే సైనిక అధికారి ఒకరు వచ్చి సెల్యూట్ చేసి సాదరంగా వి ఐ పి కారులో కూర్చోపెట్టుకుని రాష్ట్రపతి భవన్ కు తీసుకెళ్లారు ..రామారావు గారికి అంతా కల లా వుంది ..ఎక్కడో మారుమూల పల్లెటూరిలో సామాన్య ఉపాధ్యాయుడినైన తనకు జీవితంలో కానీ వినీ ఎరుగని రాచమర్యాదలతో రాష్ట్రపతి భవన్ లో అడుగుపెట్టటం ఏంటి ?అంతా కల లా ఉంది ..అసలేం జరుగుతుంది ఇక్కడ ?ఎవరు సమాధానం చెప్పటం లేదేంటి ?
ఇలా ఆలోచిస్తుండగానే అధికారులు రాష్ట్రపతి భవన్లోని ఒక విశాలమైన గదిలోకి తీసుకెళ్లి “మీరు ఇక్కడ రిఫ్రెష్ అవ్వండి ..మరికొద్దిసేపటిలో మిమ్మల్ని రాష్ట్రపతి గారి వద్దకు తీసుకెళతాం “..అని వెళ్లిపోయారు
సరిగ్గా పదినిమిషాలు కాగానే రాష్ట్రపతి ప్రత్యేక అధికారి రామారావు దంపతుల వద్దకు వచ్చి “సార్ ..మిమ్మల్ని ఇప్పుడు రాష్ట్రపతి గారి వద్దకు తీసుకెళ్తున్నాం ..పదండి ..అని బయలుదేరదీశారు
అలా రాష్ట్రపతి భవన్ లోనే వున్నా విశాలమైన హాలులోకి తీసుకు వెళ్లారు ..అప్పటికే అక్కడ రాష్ట్రపతి ,కొందరు సైనికాధికారులతో సమావేశం అయి వున్నారు
రామారావు దంపతులను చూడగానే అక్కడ ఉన్న సైనికాధికారులందరూ లేచి నిలబడి సెల్యూట్ చేసారు ..రాష్ట్రపతి కూడా కుర్చీ లోనుంచి లేచి రామారావు దంపతులకు నమస్కరించి తన పక్కన ఉన్న కుర్చీల్లో కూర్చోపెట్టారు
రాష్ట్రపతి నెమ్మదిగా హిందీలో చెప్పటం మొదలు పెట్టారు ..పక్కన తెలుగు అనువాదకులు ఆయన చెపుతున్నది తెలుగులో చెపుతున్నారు
“రామారావు గారూ ..నమస్కారం ..భరత్ మీ బిడ్డ అయినందుకు మాతోపాటు యావత్తు దేశం గర్వపడుతుంది ..అందుకు ముందుగా భారత దేశం తరపున మీకు నమస్కారాలు ..అయితే నేను చెప్పేది మీరు కొంచం గుండె దిటవు చేసుకుని వినాలి ..మీ కుమారుడు దేశం కోసం వీర మరణం పొందాడు ..ఒక్కడు ..ఒక్కడంటే ఒక్కడు ముష్కరుల తూటాలకు ఎదురెల్లి బేస్ క్యాంపులో వున్న 2000 మంది సైనికులను కుటుంబాలతో సహా కాపాడాడు ..యుద్ధంలో అతను చూపిన అసమాన ధైర్య సాహసాలను చూసిన ,విన్న మా సైనిక అధికారుల ఛాతీలు గర్వంతో ఉప్పొంగాయి ..దేశం మనకేమి ఇచ్చింది అన్నది కాదు దేశానికీ మనమేమి ఇచ్చాము అన్నది దేశానికీ ఇచ్చి చూపించాడు మీ అబ్బాయి భరత్ ..నిజంగా మీరు భరత్ అని పేరు పెట్టినందుకు కన్నవారి ఋణం ,దేశ ఋణం తీర్చుకున్నాడు భరత్ ..జమ్మూ కాశ్మీర్ లోని మారు మూల కార్గిల్ ప్రాంతంలో శత్రువులతో వీరోచితంగా పోరాడి అసువులు బాసారు ..తీవ్ర గాయాలతో వున్నఅతన్ని దగ్గర్లోని మిలిటరీ హాస్పిటల్ చేర్పించినప్పుడు చెప్పిన ఆఖరి మాటలను మీ కోసం రికార్డు చేసాం ..దేశం గర్వంతో ఉప్పొంగిపోయే మాటలు చెప్పాడు ..మీరు కూడా వినండి ..అనటంతో అక్కడే ఉన్న సైనికాధికారి ఆడియో టేప్ ఆన్ చేసాడు
“ప్రియమైన నాన్న గారికి , అమ్మకు నమస్కారాలు ..నాన్న గారు మీరు ఎప్పుడూ అంటుండేవారు గుర్తుందా ?దేశం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికేమి ఇచ్చాం అని ఆలోచించాలి అని ..అప్పుడే నాకు సైన్యంలో చేరాలని ఆలోచన వచ్చింది ..నేను మీ ఆశీర్వాదం తీసుకుని వచ్చి చేరింది సైన్యంలోనే నాన్న గారు ..సైన్యంలో చేరాక నాకు తెలిసి వచ్చింది ..దేశం కోసం ఇప్పటిదాకా నేను చేసింది ఏమీ లేదని ..కుటుంబాలను సైతం విడిచిపెట్టి ఎక్కడో బోర్డర్ లో మైనస్ చలిలో గజ గజ వణుకుతూ కావలి కాస్తున్న నా తోటి సైనికులను చూసిన తర్వాత అర్ధం అయ్యింది నాన్నగారూ ..నేను సరైన చోటికే వచ్చానని ..నేను ఇంటినుంచి బయలుదేరి వచ్చేటప్పుడే మీతో చెప్పాను నాకు ఆత్మసంతృప్తి కలిగించే పనే చేస్తానని ..దేశం కోసం పని చేస్తున్నానని ఫీలింగే నాకు గొప్ప ఆత్మ సంతృప్తి ఇచ్చింది నాన్నగారు ..ఇంకో విషయం నేను ఏ పని చేసినా మీరు గర్వంతో తల ఎత్తుకునే పనే చేస్తాను అని చెప్పాను కదా ..మీరు తలదించుకునే పని నేను ఎప్పటికి చెయ్యను నాన్నగారు ..తల దించుకోవద్దు ..మీరు తల ఎత్తుకుని గర్వంగా నా మాటలు వినండి నాన్నగారు ..ఇప్పుడు మన ఊళ్లో అందరికీ చెప్పండి నాన్నగారు ..కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి వీర మరణం పొందిన భరత్ ఎవరో కాదు ..నా కొడుకే ..అని గర్వంగా చెప్పండి .. ఒక్క నిమిషం నిశ్యబ్దం
“సార్ ..ఇప్పుడు నేను నా అధికారులతో మాట్లాడుతున్నా ..సార్ ..నా మరణం తర్వాత గోదావరి జిల్లాల్లో వున్న మా అమ్మగారిని ,నాన్న గారిని అధికార లాంఛనాలతో రాష్ట్రపతి భవన్ కు తీసుకురండి ..నా శవం చూసిన తర్వాత నా తల్లితండ్రుల కళ్ళలో చుక్క నీరు కారకుడదు ..రామారావు మాస్టారు గారు గర్వంతో తల ఎత్తుకునేలా ఏర్పాట్లు చేయండి ..రాష్ట్రపతి గారు దయచేసి నా చివరి కోరికను తీర్చండి ..మరు జన్మంటూ ఉంటే మళ్ళీ సైనికుడిగానే పుడతా ..దేశ మాత సేవ చేసుకుంటా ..జై హింద్
మాటలు ఆగిపోయాయి .. హాల్లో సూది పడితే వినిపించేంత నిశ్యబ్దం
రామారావు మాస్టారి దంపతుల కళ్లలోనుంచి కన్నీటి బొట్లు కారుతున్నాయి
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో సైనికులకు ఈ కధ అంకితం ..!
పరేష్ తుర్లపాటి