ఇది కధ కాదు
“ప్రయాణీకులకు విజ్ఞప్తి ..మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లవలిసిన బస్సు బయలుదేరుటకు సిద్ధంగా వుంది “..హైదరాబాద్ ఇమ్లిబన్ బస్సు స్టేషన్ లో మైక్ అనౌన్సమెంట్ వినబడగానే వెంకట్ భార్యను ,కూతురిని తీసుకుని గబ గబా బస్సు వున్న ఫ్లాట్ ఫార్మ్ దగ్గరికి వచ్చి ఒకసారి టికెట్ మీద వున్న బస్సు నంబర్ సరి చూసుకుని బస్ ఎక్కాడు ..లోపల అప్పటికే మిగిలిన ప్రయాణీకులు అందరు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు ..డ్రైవర్ కూడా ఇంజిన్ స్టార్ట్ చేసి వీళ్ళ కోసమే ఆగినట్టున్నాడు
వెంకట్ డ్రైవర్ దగ్గరికి ” మా సీట్లు నంబర్లు ఎక్కడ వున్నాయి ” అడిగాడు
డ్రైవర్ టికెట్ మీద వున్న నంబర్లు చెక్ చేసుకుని తనకు ఎడమవైపున వున్న సీట్లు చూపించి “అక్కడ కూర్చోండి సార్ ” అన్నాడు .
వెంకట్ తన లగ్గేజ్ సీటు పైన వున్న రాక్ లో పెట్టి భార్య ,కూతురు తో సహా తమ తమ సీట్లలో కూర్చున్నారు
అప్పుడు వెంకట్ టైము చూసుకున్నాడు ..రాత్రి పది గంటలు కావస్తుంది
డ్రైవర్ను చూస్తే ఇంకా కుర్రాడిలానే వున్నాడు ..ఎలా నడుపుతాడో ఏంటో అనుకుంటూ ..,
“మా కోసమే ఆగినట్టుంది ” అని డ్రైవర్తో మాట కలిపాడు ..స్వతహాగా జర్నలిస్ట్ అయిన వెంకట్
“అవును సార్ “..అని బస్సును బస్సు స్టాండ్ నుంచి బయటకు పొనిస్తున్నాడు డ్రైవర్
“నీ పేరేంటి ” మెల్లగా డ్రైవర్ తో కబుర్లు మొదలు పెట్టాడు వెంకట్
“రామారావు సార్ ” అందరు రాము అని పిలుస్తారు
“అయితే నేను కూడా రాము అనే పిలవ వచ్చా “నవ్వుతూ
రాము సమాధానం చెప్పలేదు ..చిన్నగా నవ్వి ఊరుకున్నాడు
“అవును మనం బెంగుళూరు వెళ్లేసరికి ఎంత టైం అవుతుంది “
ఉదయం తొమ్మిది గంటల వరకు వెళ్ళిపోతాం సార్ “
బస్సు మెల్లిగా హైవే మీద పోతుంది
ఈ లోపు వెంకట్ ఏడేళ్ల కూతురు “డాడీ ..రేపు బెంగుళూరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నాకు దీపావళి చిచ్చుబుడ్లు ..లక్ష్మి ఔట్లు కొనిపెట్టాలి “అడిగింది
వెంకట్ సమాధానం చెప్పేలోగానే రాము “ఆమ్మో లక్ష్మి ఔట్లె ..భయం వేయదా అమ్మా “..బస్సు నడుపుతూనే కలిపించుకుని అడిగాడు
“చుడండి అంకుల్ ..నాకు భయం లేదని చెప్పినా మా డాడీ నాకు లక్ష్మి ఔట్లు మాత్రం కొననంటున్నాడు “గారాబంగా చెప్పింది వెంకట్ కూతురు
ఎందుకో రాము తల తిప్పి ఒక్క క్షణం ఆ అమ్మాయి వైపు చూసి మళ్ళీ డ్రైవింగ్ వైపు ద్రుష్టి పెట్టాడు
“ఎల్లుండి దీపావళి పండగ కదా ..బెంగుళూరులో వున్న మా అత్తగారింటికి వెళ్తున్నాం ..పొద్దుటినుంచి ఇది ఒకటే సతాయిస్తుంది ..ఈ సారి లక్ష్మి ఔట్లు కొనిపెట్టాల్సిందే అని ..నువ్వైనా చెప్పు రాము అవి కాల్చటం డేంజర్ అని “చెప్పాడు వెంకట్ డ్రైవర్ రాము తో
రాము ఏమి మాట్లాడలేదు ..నిశబ్దంగా బస్సును పొనిస్తున్నాడు
అంకుల్ “సైరా ” సినిమా చూసారా ” మళ్ళీ వెంకట్ కూతురే కల్పించుకుని అడిగింది రాముని
ఏదో ఆలోచిస్తున్న రాము తేరుకుని “లేదమ్మా ..మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక చూడాలి “చెప్పాడు ముభావంగా
ఇదిగో అంకుల్ డ్రైవింగ్ చేస్తున్నారుగా ..అలా విసిగించకు ..పడుకో..పిల్లను కసురుకుంది వెంకట్ భార్య
బస్సులో లైట్లు కూడా ఆపేసి రాము బస్సును హైవే మీద పొనిస్తున్నాడు
అప్పటికే బస్సులో వున్న ప్రయాణీకులు అందరు నిద్రలోకి జారుకున్నారు
వెంకట్ ,భార్య ,కూతురు కూడా నిద్రలోకి జారుకున్నారు
రాము బస్సును ఒక డాబా పక్కన ఆపటంతో వెంకట్ కు మెలుకువ వచ్చింది ..టైం చూసుకుంటే అర్ధరాత్రి రెండు గంటలు అవుతుంది
కిటికీ లోనుంచి చూస్తే రాము డాబా కు ఆనుకుని వున్న చాయ్ బడ్డీ దగ్గర చెంబుతో మొహం కడుక్కుంటూ కనపడ్డాడు ..మొహం కడుక్కుని వేడి వేడిగా చాయ్ తాగాడు ..ఆ టైం లో సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు
ఈ లోపు బాత్రూం కి దిగిన ప్రయాణీకులు కూడా బస్సు ఎక్కారు
రాము బస్సు ఎక్కి మళ్ళీ స్టార్ట్ చేసాడు
“నిద్ర వస్తుందా ” నిద్ర మత్తులోనే వెంకట్ రాముని అడిగాడు
“లేదు సార్ ..మాకిలాంటివి అలవాటే “.. చెప్పి మళ్ళీ బస్సుని బెంగుళూరు వైపు పోనిచ్చాడు
మెల్లిగా వెంకట్ నిద్రలోకి జారుకున్నాడు
మధ్య రాత్రిలో సడెన్ గా వెంకట్ కు మెలకువ వచ్చింది
చీకటిలో డ్రైవర్ రాము మొహం సరిగా కనపడటం లేదు ..కానీ బస్సును నిదానంగానే నడుపుతున్నాడు అన్పించింది ..అలా ఆలోచిస్తూనే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు వెంకట్
ఎప్పుడు వచ్చిందో బెంగుళూరు ..బస్ స్టాండ్ లో ఆపి “సార్ ..బెంగుళూరు వచ్చింది “..నిద్రలో వున్న వెంకట్ ను తట్టి చెప్పాడు రాము
కళ్ళు తెరిచి చూసిన వెంకట్ కు ఎర్రబడిన కళ్ళతో డ్రైవర్ రాము కన్పించాడు
..మొహం కూడా చాల పాలిపోయినట్లు అనిపించింది ..ఎందుకో అతని మొహం చూస్తే ఎదో కోల్పోయిన వాడిలా కనిపించాడు
అదే అడుగుదాము అనుకునే లోగా ఎప్పుడు లేచిందో వెంకట్ కూతురు రాము చెయ్యి పట్టుకుని “అంకుల్ ..నాకు లక్ష్మి ఔట్లు కొనిపెట్టమని మా డాడీకి చెప్పారా ?లేదా ?అడిగింది
“లేదమ్మా ..ఇప్పుడే చెప్తాను ..ముందు నువ్వు ఈ చాకోలెట్ తీసుకో ” అంటూ జేబులో వున్నా ఫైవ్ స్టార్ చాకోలెట్ తీసి ఆ పిల్ల చేతిలో పెట్టాడు
నవ్వుకుంటూ వెంకట్ ,భార్య కూతురు తో బస్సు దిగి వెళుతుంటే “సార్ ..ఒక్క మాట “వెనకనుంచి వెంకట్ ను పిలిచాడు రాము
తండ్రిని డ్రైవర్ రాము పిలవటంతో కూతురు మొహం మతాబులా వెలిగిపోయింది ..టపాసుల గురించి చెప్పటానికే అలా పిలిచాడనుకుంది
డ్రైవర్ రాము వెంకట్ ను పక్కకు తీసుకెళ్లి పది నిమిషాల పాటు ఏదో చెప్పాడు
పది నిమిషాలు మాట్లాడిన తర్వాత కొద్దీ దూరంలో తల్లి దగ్గర నిలబడి చూస్తున్న వెంకట్ కూతురి వంక చూసి “బై ” అన్నట్లుగా చెయ్యి ఊపాడు ..రాము
వెంకట్ కూతురు కూడా రాము అంకుల్ డాడీతో మాట్లాడి లక్ష్మి ఔట్లు కొనటానికి ఒప్పించినట్లు వున్నాడు అని “బై అంకుల్ “అని నవ్వుతూ చెయ్యి ఊపింది
ఈ లోపు వెంకట్ మామగారు పంపించిన కారు పికప్ చేసుకోవటానికి వచ్చింది ..
ముగ్గురూ కారులో కూర్చున్నారు
వెంకట్ మాత్రం ఎందుకో ముభావంగా వున్నాడు ..కూతురి చేతిలో వున్న ఫైవ్ స్టార్ చాకోలెట్ వంకే చూస్తుండిపోయాడు
వెంకట్ భార్యకి కూడా భర్త సడెన్ గా అలా ముభావంగా ఎందుకు అయ్యాడో అర్ధం కాలేదు
అదే విషయం అతన్ని అడిగింది
వెంకట్ భారమైన మనస్సుతో భార్యకు చెప్పటం మొదలు పెట్టాడు
ఇందాక రాము బస్ స్టాన్డ్ లో నాతొ ఏమి మాట్లాడంటే … వెంకట్ చెపుతున్నాడు ..వింటుంటే భార్యకు కూడా కళ్ళంబడి నీళ్లు తిరుగుతున్నాయి
“సార్ ..రాత్రి బస్సులో మీరు ఎక్కినప్పటినుంచి మీ అమ్మాయిని చూస్తుంటే నాకు నా కూతురే గుర్తుకు వచ్చింది ..అందుకే రాత్రి టీ కి బస్సు ఆపినప్పుడు మీ అమ్మాయికోసమే ఫైవ్ స్టార్ చాకోలెట్ కొన్నాను సార్ ..నాకు ఎక్కువగా వేరే ఊర్లకు డ్యూటీ పడుతుండటంతో కుటుంబంతో గడిపేదే తక్కువ సార్ ..నా కూతురికి కూడా మీ కూతురి వయసే ఉంటుంది సార్ ..రెండు రోజుల బట్టి ఈ సారి దీపావళి పండుగకు నువ్వు ఇంట్లో ఉండి నాతొ టపాసులు కాలిపించాలి నాన్నా “..అని మారం చేస్తుంది సార్ ..సైరా సినిమాకి తీసుకెళ్లమని వారం రోజుల నుంచి నాతొ పోట్లాడుతుంది సార్ ..అందుకే రాత్రి మీ అమ్మాయి మాటలు వింటుంటే నా కూతురి మాటలే గుర్తుకు వచ్చాయి సార్ ..బస్సు నడుపుతున్నానన్న మాటే కానీ ఏడుస్తూనే వున్నా సార్ ..అందుకే రాత్రి రెండు గంటలకు నా భార్యకు ఫోన్ చేసి ఎల్లుండి దీపావళి పండక్కు కూతురుతో టపాసులు కాలిపిస్తానని ..ఆ సంగతి తెల్లారి కూతురు లేచాక తనకే చెప్పమని కూడా చెప్పాను సార్ ..కుటుంబంతో కలిసి పండగలు చేసుకునేంత టైము ,ఆలోచనలు కూడా మాకు వుండవు సార్ ..అసలు మా బతుకులకు సరైన భరోసా కూడా ఏమి ఉండదు సార్ ..నేను మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరేదాకా నా భార్య గుమ్మంలో నిలబడి నా కోసం చూసే ఎదురు చూపులు నాకు గుర్తే సార్ ..నన్ను చూడగానే నా భార్య ముఖంలో ,కూతురు ముఖంలో కనిపించే వెలుగు కూడా నాకు ఎప్పటికి గుర్తే సార్ ..”
ఇకపోతే మీరు కూర్చున్న సీట్లు ఎంపీకి ,ఎమ్మెల్యే కి రిజర్వ్ చేసిన సీట్లు సార్ ..అంటే వారు కనుక బస్సులో ప్రయాణించే దలిస్తే ఆ సీట్లు వారికి ఉచితంగా కేటాయిస్తారు సార్ ..ఇదే కాకుండా ఇంకా కొన్ని క్యాటగిరీల వాళ్లకు టికెట్లలో రాయితీలు గట్రా ఉంటాయి సార్ ..ఇలా వచ్చి ఆలా వెళ్లిపోయేవాళ్లకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం ..బస్సునే నమ్ముకుని కుటుంబాలకు దూరంగా రేయనక ,పగలనక పనిచేసే మాకు ఎందుకు సరైన భద్రతా కల్పించలేకపోతుంది సార్ ?
సరే ..నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని విసిగించినట్లున్నాను సార్.. మీరు రాత్రి నాతో మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్టును అని చెప్పారు కదా సార్ ..అందుకే మీకు ఇదంతా చెప్పాలనిపించింది ..ఇదిగోండి సార్ నా మొబైల్ నంబర్ ..మీకు అభ్యన్తరం లేకపోతె మళ్ళీ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకురండి సార్ ..నా భార్యకు ,కూతురికి పరిచయం చేస్తాను ..ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పాడు రాము
ఇదంతా కూతురు వినకుండా వెంకట్ భార్యకు చెప్పాడు
భారమైన మనసుతో ఇంటికి చేరుకున్నారు వెంకట్ దంపతులు
మర్నాడు పొద్దున్నే గుమ్మంలో పడి వున్న పేపెర్ను యధాలాపంగా చుసిన వెంకట్ ఉలిక్కిపడ్డాడు
పేపర్ మొదటి పేజీలోని పెద్ద పెద్ద అక్షరాలతో “బెంగుళూరు నుంచి హైద్రాబాదు వెళుతున్న బస్సుకు ప్రమాదం ..ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాము దుర్మరణం ..డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణీకులకు తప్పిన ప్రాణ హాని ..తప్ప తాగి నిర్లక్షముగా లారీ నడపటమే కాకుండా బస్సును నేరుగా ఢీకొనటంతోనే ఈ దుర్ఘటన సంభవించిందని ఆ సమయంలో బస్సు డ్రైవర్ రాము సమయస్ఫూర్తిగా వ్యవహరించి బస్సును వంతెన పై నుంచి పడకుండా పక్కకు తిప్పటంతో తమకు పెను ప్రమాదం తప్పిందని పలువురు ప్రయాణీకులు బస్సు డ్రైవర్ రామును కొనియాడారు..ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రైవర్ రాము కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసారు
చదువుతున్న వెంకట్ కి తరవాత అక్షరాలు కనపడటం లేదు ..కళ్ళంబడి ధారగా కారుతున్న కన్నీటితో
వెంకట్ కి ఆ క్షణంలో గుర్తుకు వచ్చింది రాము కూతురే
ఈ కధ బస్సు కార్మికులకు అంకితం
తుర్లపాటి పరేష్
(మిత్రుడు తుర్లపాటి సురేష్ ఫేస్ బుక్ వాల్ నుండి సేకరించినది)